Srisailam : శ్రీశైల క్షేత్రంలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ (K Ramachandra Mohan) అన్నారు. మంగళవారం ఆయన భక్తుల సౌకర్యాల కల్పన, క్షేత్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలను సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. పరిపాలనా కార్యాలయ భవనంలోని సమావేశ మందిరంలో సాయంత్రం అన్ని విభాగాల అధిపతులు, పర్యవేక్షకులతో సమావేశమై దేవస్థాన పరిపాలనా అంశాలను రామచంద్రమోహన్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కె. రామచంద్రమోహన్ మాట్లాడుతూ.. ‘అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికబద్దంగా చేపట్టాలి. ముఖ్యంగా సామాన్య భక్తులకు సదుపాయల కల్పనకై తీసుకోవాల్సినన అన్ని చర్యలను వెంటనే చేపట్టలి. సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఆలయ నిర్వహణ ఉండాలి. క్షేత్రానికి విచ్చేసే ప్రతీ భక్తుడు /భక్తురాలు సంపూర్ణంగా తన యాత్ర ఫలవంతమైందనే తృప్తి కల్పించాల్సిన బాధ్యత దేవస్థానం సిబ్బంది, అధికారులపై ఉంది. భక్తుల మనోభావాలను, వారి విశ్వాసాలను గౌరవించాలి’ అని కీలక సూచనలు చేశారు.
ఈ సమీక్షలో ఇటీవల పూర్తయిన పనులు, ప్రస్తుతం చేపట్టిన పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల గురించి అధికారులతో దేవాదయ శాఖ కమిషనర్ చర్చించారు. తాత్కాలిక క్యూ కాంప్లెక్సు నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారును ఆదేశించారు. మూడు మాసాలలోగా నిర్మాణ ప్రక్రియ ప్రారంభమయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే 30 సంవత్సరాలలో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకుని శాశ్వత క్యూ కాంప్లెక్సు నిర్మాణ ప్రణాళిక ఉండాలని ఆయన అధికారులకు సూచించారు.
అదేవిధంగా ఆలయ ముందుభాగంలో గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు గల ప్రధానవీధి సుందరీకరణకు, ప్రధానవీధిలో సాలుమండపాల నిర్మాణానికి సంబంధించి కమిషనర్ కొన్ని సూచనలు చేశారు. సామాన్య భక్తులకు వసతి కల్పించేందుకు గణేశసదనం వద్ద మరో సత్రనిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో విచ్చేసే శివదీక్షా భక్తుల సౌకర్యార్థం శివదీక్షా శిబిరాలలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం ప్రధానాలయంలోని ప్రాచీన కట్టడాలను కమిషనర్ పరిశీలించారు. ఆలయంలోని నందిమండపం, వృద్ధమల్లికార్జునస్వామి ఆలయ ముఖమండపం, అమ్మవారి ఆలయ ప్రవేశద్వార మండపాలను రామచంద్రమోహన్ పరిశీలించారు. అవసరమైతే వీటికి తగు మరమ్మతులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు.
‘ప్రాచీన నిర్మాణశైలికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ మరమ్మతులు ఉండాలి. అమ్మవారి ఆలయంలో ఉత్తరం వైపున నిర్మించతలపెట్టిన ప్రాకార మండపం పనులు త్వరితంగా పూర్తి చేయాలి. ఆలయ మహాద్వారం ముందు ప్రస్తుతం ఉన్న రేకుల పైకప్పుస్థానంలో రాతి మండప నిర్మాణానికి ప్రతిపాదనలను రూపొందించాలి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్షేత్రసుందరీకరణకు విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలి. ముఖ్యంగా కదంబం, బిల్వం, రావి మొదలైన దేవతా మొక్కలను అధిక సంఖ్యలో నాటాలి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రధానమైన చోట్ల సుందరీకరణ మొక్కలను పెంచాలి. అదేవిధంగా అవకాశం ఉన్నచోట వర్టికల్ గార్డెన్లను ఏర్పాటు చేయాలి’ అని అధికారులకు కమిషనర్ చెప్పారు. ఈ సందర్భంగా రామచంద్రమోహన్ దేవస్థాన జమా ఖర్చులను పరిశీలించారు. అటు పిమ్మట దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాదవితరణ, గోసంరక్షణ, పరిపాలనా, ఆడిట్, అకౌంట్స్, ప్రసాదాలు, పారిశుద్ద్యం మొదలైన అంశాలను ఆయన సమీక్షించారు.
భక్తుల సౌకర్యాల కల్పనలో భాగంగా శివసేవకుల స్వచ్ఛందసేవను విరివిగా వినియోగించు కోవాలని కోరారు. స్వచ్ఛంద సేవకులు ఆలయంలో ఆయా సేవలు అందించేందుకు దేవస్థాన వెబ్సైట్లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని మరింతగా విస్తృత పరచాలని కమిషన్ సూచించారు. శివసేవకుల స్వచ్ఛంద సేవలను వినియోగించుకోవడం వలన భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించే వీలు కలుగుతుందని అన్నారు. ఆలయంలో క్యూలైన్ల నిర్వహణ, క్యూకాంప్లెక్సులో దర్శనం కోసం వేచి వున్న భక్తులకు మంచినీటి సరఫరా, అల్పాహారం అందజేయుట, అన్నప్రసాద వితరణ మొదలైన చోట్ల
శివసేవకుల సేవను వినియోగించుకోవాలని అధికారులకు కమిషనర్ సూచించారు. స్వచ్ఛందసేవకు వచ్చే శివసేవకులకు శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుండాలన్నారు. దేవస్థానంలో ప్రతి ఉద్యోగి కూడా నిబద్ధతతో, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కోరారు. ఉద్యోగులు బాధ్యతాహితంగా విధులు నిర్వర్తిస్తూ జవాబుదారీతనాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. పాలనాపరంగా పూర్తి పారదర్శకతను కలిగి ఉండాలని సూచించారు.
భక్తులు ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని వినియోగించుకునే విధంగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన, సమీక్షలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, దేవదాయశాఖ చీఫ్ ఇంజనీరు జి.వి.ఆర్. శేఖర్, దేవదాయశాఖ స్థపతి పి. పరమేశ్వరప్ప, దేవదాయశాఖ శిల్పవిభాగపు సలహదారు ఎస్. సుందర్రాజన్, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.