AP News | చర్చికి వచ్చిన భక్తులకు సన్మార్గాన్ని బోధించాల్సిన ఓ పాస్టర్ తప్పుదోవ పట్టాడు. ప్రార్థనల కోసం వచ్చిన బాలికపై కన్నేసి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే దేవుడు శపిస్తాడని బెదిరించాడు. దీంతో బాలిక సైలెంట్ కావడంతో పలుమార్లు అతని కామవాంఛ తీర్చుకున్నాడు. ఏలూరు జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కాళ్లచెరువు గ్రామంలో చౌటపల్లి రాంబాబు (42) చర్చి ఏర్పాటు చేసి ప్రార్థనలు నిర్వహిస్తుండేవాడు. తన బోధనలతో పాస్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గ్రామంలోనే కూలీ పనులు చేసుకునే ఓ కుటుంబం కూడా తరచూ వచ్చి ప్రార్థనలు చేస్తుండేది. తమ సమస్యల పరిష్కారం కోసం, ఆధ్యాత్మిక శాంతి కోసం రాంబాబు నిర్వహించే ప్రార్థనల్లో పాల్గొనేవారు. ఈ క్రమంలో ఆ కుటుంబంలోని 14 ఏళ్ల బాలికపై పాస్టర్ రాంబాబు కన్నేశాడు. మాయమాటలతో ఆమెను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారం చేయించాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే దేవుడు శపిస్తాడని ఆ బాలికను భయపెట్టి ఆమె నోరు మూయించాడు. దేవుడి పేరుతో చేసిన ఈ బెదిరింపులకు భయపడి బాలిక ఎవరితోనూ తనపై జరుగుతున్న అకృత్యాన్ని చెప్పుకోలేకపోయింది. ఇదే అదనుగా పాస్టర్ మరింత రెచ్చిపోయి తన కామవాంఛలను తీర్చుకునేవాడు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా నెలసరి రాకపోవడంతో గర్భం దాల్చి ఉంటుందని అనుమానించి, బాలికతో గర్భనిరధక మాత్రలు మింగించాడు. ఆ మాత్రలు ఓవర్‌డోస్ కావడంతో బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. పరిస్థితి విషమించడంతో తట్టుకోలేకపోయిన బాలిక.. జరిగిన విషయాన్ని తల్లికి చెప్పుకుంది. బాలిక తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో తల్లిదండ్రులు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు తడికలపూడి ఎస్సై వల్లి పద్మ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు.
పాస్టర్ రాంబాబుతో గొడవపడి చాలాకాలం కిందటే ఇద్దరి పిల్లలను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రాంబాబు ఒక్కడే ఉంటున్నాడు. గతంలో ఆసినగూడెంలో పాస్టర్‌గా పనిచేసిన సమయంలో అక్కడ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో గ్రామ పెద్దలు మందలించి అక్కడి నుంచి పంపించేశారు. అయినప్పటికీ మార్పు రాలేదు. తాజాగా కాళ్లచెరువులో అభంశుభం తెలియని బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో సదరు పాస్టర్‌ను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.