వాన అంటే ఏమిటో కాదు
మన పొట్టకూటి కోసం
తమ రెక్కలు ముక్కలు చేసుకుని
మేఘాలు భూమి మీదికి కార్చిన ముచ్చెమటలు
వానంటే
తెప్పలు నేల మీద చల్లిన
చూడసక్కదనపు సాన్పు
వృష్టి-
సూర్యుడు నిర్దాక్షిణ్యంగా ఎత్తుకెళ్లి
ఆకాశపు చెరలో ఉంచిన
నిర్దోషులైన నీళ్లను విడుదల చేస్తూ
ఆర్ధ్ద్రహృదయంతో మొయిళ్లు
ప్రసాదించిన దయాభిక్ష
వర్షం-
రాటుదేలిన మేఘాలు
తమలో దాగి ఉన్న దూదిని
రాట్నాలతో వడికి
తయారైన నూలు దారాల నీళ్ల ధారలతో
ఈ భూతలమ్మీద నేసిన అద్భుత జలవస్త్రం