రఘునాథపాలెం, ఆగస్టు 16 : బీఆర్ఎస్ను నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ భరోసానిచ్చారు. ఆదివారం ఖమ్మం నగరం 8వ డివిజన్ పరిధి గోపాలపురంలో ఖానాపురం హవేలీ పరిధిలోని 15 డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏల ఆత్మీయ సమావేశం పార్టీ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు దేవభక్తిని కిశోర్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించగా.. పువ్వాడ అజయ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలో అర్హులైన ప్రతిఒక్కరి ఓటునూ పరిరక్షించడంలో పార్టీ బీఎల్ఏలు శక్తివంచన లేకుండా పనిచేశారని కొనియాడారు. బూత్ స్థాయిలో కమిటీలను మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు.
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గంలో అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులు ప్రస్తుతం తుమ్మలతోపాటు ఆయన కుమారుడి వెంట ఉండి ఇసుక, మట్టి, భూ అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టులో నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఏడాదికే కాలువ సీసీ లైనింగ్ కూలిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
మున్నేరుపై తీగల వంతెన, కాంక్రీట్ వాల్, ఇంజినీరింగ్ కాలేజీలు కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే మంజూరయ్యాయనే విషయాన్ని గుర్తుచేశారు. నాలుగు దశాబ్దాలుగా పువ్వాడ కుటుంబానికి ఖమ్మం నియోజకవర్గంతో విడదీయరాని బంధం ఉందని పేర్కొన్నారు. తాను మళ్లీ ఖమ్మం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని తేల్చిచెప్పారు.