హైదరాబాద్, ఆగస్టు 16, (నమస్తే తెలంగాణ) : సొంత రాజకీయ ప్రచారం కోసం కాంగ్రెస్ సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఫొటోలు ముద్రించడాన్ని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో వ్యతిరేకించారు. ఆగస్టు 15న ప్రారంభించిన 1.05 కోట్ల లామినేటెడ్ రేషన్ కార్డుల పంపిణీ పేరిట ప్రభుత్వం రూ.100 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని దాసోజు ఆరోపించారు. రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు, గ్రాట్యుటీ చెల్లించేందుకు నిధులు లేవని చెప్పే ప్రభుత్వం, సొంత డబ్బా కోసం కోట్ల రూపాయలు కేటాయించడమేంది? అని ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలో అధికారులు పట్టాదార్ పాస్ పుస్తకాలు, రేషన్ కార్డులపై ఫొటోలు పెడుదామని కోరినా.. ‘ప్రజాధనంతో మన ఫొటోలు వద్దు’ అని నిరాకరించిన విషయాన్ని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తే ఈ కార్డులన్నీ రద్దయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ‘రేషన్ కార్డులపై ముద్రించిన ముఖ్యమంత్రి, మంత్రి ఫొటోలను తొలగించాలి. ప్రజలకు ప్రభుత్వ అధికారిక ముద్రతో కూడిన కార్డులు అందజేయాలి. రూ.100 కోట్ల దుబారాపై తక్షణమే కాగ్‌తో సమగ్ర ఆడిట్ జరిపించాలి’ అని దాసోజు శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు.