ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పరిధిలోని పట్టభద్రులు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు తమ ఓటును నమోదు చేసుకోవాలని ఈసీ సూచించింది.
నవంబర్ 23న పట్టభద్రుల ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటిస్తారు. డిసెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి.. అదే నెల 30వ తేదీన తుది జాబితాను వెల్లడిస్తారు. ఇక ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఓటర్ల నమోదుకు సంబంధించి ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు కోసం ఫారమ్ 18 నింపాల్సి ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి.. ఎన్నికలు జరిగే జిల్లాల పరిధిలోని నివసించే వారందరూ గ్రాడ్యుయేట్‌గా తమ ఓటును నమోదు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఎక్కడ పూర్తి చేసినా సరే ఆధార్‌లో ఉన్న అడ్రస్ ఆధారంగా తమ ఓటును నమోదు చేసుకోవడానికి వీలుంటుంది. అయితే అధికారులు వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు దరఖాస్తుదారుడు ఒరిజినల్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. ఓటు హక్కు నమోదు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.