అమరావతి : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఫెంగల్ తుపానుగా (Fengal Cyclone ) మారింది. గంటకు 12 కిమీ వేగంతో తుపాను ప్రస్తుతం పుదుచ్చేరికి (Puducherry) 150 కి.మీ దూరంలో , చెన్నైకి 140 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.ఈరోజు సాయంత్రానికి తుపానుగా తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని తెలిపారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరం వెంబడి 70 నుంచి 90 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. వాయుగుండం కారణంగా నెల్లూరు, చిత్తూరు , కడప జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్‌కు అకాశముందని హెచ్చరికలు రావడంతో ఏపీ సర్కార్ అప్రమత్తమయ్యింది.
పెంగల్ తుపాన్ ప్రభావంతో తిరుమలలో నిన్న రాత్రి నుంచి భారీ ఈదురుగాలులతో వర్షం పడుతుంది. నెల్లూరు జిల్లాలో కావలి, అల్లూరు, దరదర్తి, బోగోలు మండల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. తుమ్మలపెంట సముద్రతీరం వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి.
ఫెంగల్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఫెంగల్ తుపాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకావముందని వాతావరణశాఖ హెచ్చరికల మేరకు ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం విపత్తు నిర్వహణ శాఖ, కలెక్టర్లు, సీఎంవో రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో సమీక్షను నిర్వహించారు.
తుపాను కారణంగా అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి చర్యలు చేపట్టాలని, ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఆకస్మిక వరదల సూచన దృష్ట్యా డిజాస్టర్ టీమ్‌ను సిద్ధంగా ఉంచాలని, ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సహాయక చర్యలు, పునరావస కార్యక్రమాలకు సమాయత్తం కావాలని . రైతులకు తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయాలని సూచించారు.