అమరావతి : కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి( AP Economic) ప్రమాదకర పరిస్థితిలో ఉందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan ) ఆరోపించారు. 2025-26లో అర్ధ సంవత్సర ఆర్థిక పరిస్థితిపై కాగ్ విడుదల చేసిన గణాంకాలు ఉటంకిస్తూ కాగ్ నివేదికను ట్విట్టర్లో పోస్టు చేశారు.
సంపద సృష్టిస్తామంటూ కూటమి నాయకులు చెప్పిన దానికి భిన్నంగా పరిస్థితి ఉందని విమర్శించారు. సొంత ఆదాయాలు ఏమాత్రం పెరగకపోగా, మూల ధన పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోతుందని ఆరోపించారు. 2025-26లో ఆర్థిక సంవత్సర వృద్ధి 17.1శాతం లక్ష్యంగా పెట్టుకోగా నేడు కేవలం 7.03 శాతం మాత్రమే పెరిగిందన్నారు.
టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును గమనిస్తే వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతుందని ఎలా ప్రచారం చేస్తారని మండిపడ్డారు. గడిచిన రెండేళ్లలో కేవలం 2.75 శాతం మాత్రమే పెరిగిందని వివరించారు.
2019-24 సంవత్సరంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 9.87శాతం రాష్ట్ర రెవెన్యూ పెరిగిందని అన్నారు. రూ. 58,031 కోట్లు ఉన్న బడ్జెట్ రూ. 91,922 కోట్లకు పెరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల విషయంలో మాత్రం దూసుకుపోతుందని ఆరోపించారు.