ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు (Earthquake) వచ్చాయి. జిల్లాలోని ముండ్లమూరు మండలంలో సెకను పాటు భూమి కంపించగా.. సింగన్నపాలెం, మారెళ్లలో భూకంపం వచ్చింది. శనివారం కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. వరుసగా రెండు రోజులు భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
శనివారం రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్టుగా హైదరాబాద్‌లోని ఎన్జీఆర్ఐ వెల్లడించింది. ప్రకాశం జిల్లా పశ్చిమ అద్దంకి ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. ముండ్లమూరు మండలంలో సుమారు రెండు సెకన్లపాటు భూమి కంపించినట్టుగా స్థానికులు పేర్కొన్నారు. శంకాపురం, తాళ్లూరు, పసుపుగల్లు, మారెళ్ల, వేంపాడు, తూర్పు కంభంపాడు, రామభద్రాపు రం, గంగవరం, వంటి సమీప గ్రామాల్లోనూ భూమి కంపించిందని పేర్కొన్నారు. దీంతో ముండ్లమూరు పాఠశాలలో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు సైతం బయటకు వచ్చారు.