అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న ఆయనను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజు ట్రాఫిక్ సరిగా నియంత్రించలేదనే విమర్శల నేపథ్యంలో ప్రభుత్వ నూతన డీజీపీని నియమించడం గమనార్హం.
1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ల సీనియారిటీ జాబితాలో అందరికంటే ముందున్నారు. ఉమ్మడి ఏపీలో కర్నూలు ఏఎస్పీగా ఆయన తొలిసారి పోస్టింగ్ అందుకున్నారు. అనంతరం కామారెడ్డి, ధర్మవరంలోనూ ఏఎస్పీగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఎస్పీగా పదోన్నతి పొందిన ఆయన అనంతపురం, కడప, మెదక్ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే, సీఐడీ, సీబీఐ విభాగాల్లో ఎస్పీగా పనిచేశారు. అనంతపురం, హైదరాబాద్ రేంజ్లతోపాటు ఎస్ఐబీలో డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా విధులు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్గా, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ సీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 జూన్ నుంచి ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్నారు.