Srisailam Dussehra Mahotsavam | శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీస్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ సంపూర్ణంగా జరిపించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామివారికి విశేష అర్చనలు, అమ్మవారికి ప్రత్యేకపూజలు, రుద్రయాగం, చండీయాగం, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, స్వామిఅమ్మవార్లకు వివిధ వాహనసేవలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
సెప్టెంబరు 22 తేదీన ఉదయం 9.00 గంటలకు అమ్మవారి ఆలయ యాగశాల ప్రవేశంతో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ పూజలలో వేదస్వస్తి, ఉత్సవ సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ పూజ, దీక్షాసంకల్పం, ఋత్విగ్వరణం, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధన, చండీకలశస్థాపనలు జరిపిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి స్వామివారి ఆలయంలో యాగశాల ప్రవేశం, చతుర్వేద పారాయణలు, శివసంకల్పం, గణపతి పూజ అఖండదీపస్థాపన, వాస్తుపూజ, శ్రీదేవికలశస్థాపన జరిపిస్తారు. ఉత్సవాలలో రుద్రపారాయణ, చండీపారాయణ, అమ్మవారికి శ్రీచక్రార్చన, విశేష కుంకుమార్చనలు, సువాసినీపూజ, కాళరాత్రిపూజ జరిపిస్తారు. లోకకల్యాణం కోసం ఉత్సవాలలో ప్రతీరోజు జపాలు, పారాయణలు, జరిపించనున్నారు.
మహర్నవమి సందర్భంగా అక్టోబర్ 1వ తేదీన శ్రీస్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 2వ తేదీ ఉదయం యాగపూర్ణాహుతి, కలశోద్వాసన, అవబృథం తదితర కార్యక్రమాలు జరిపించనున్నారు. సాయంకాలం జరిపే తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతిరోజు నిర్వహించే ఆర్జిత సేవలైన స్వామివారి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన, కల్యాణోత్సవం యథావిధిగా జరుగుతాయి. అయితే గణపతి హోమం, చండీహోమం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, లక్ష కుంకుమార్చన, నవావరణ పూజ, సువర్ణ పుష్పార్చన, ఉదయాస్తమాన సేవ, ప్రదోషకాలసేవలను మాత్రం నిలిపివేశారు.
ఇక ఉత్సవ విశేషాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా గంగాధర మండపం వద్ద ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటుచేశారు. శ్రీస్వామిఅమ్మవార్ల గ్రామోత్సవంలో జానపద కళారూపాల ప్రదర్శన నిర్వహించనున్నారు. అదేవిధంగా క్యూ కాంప్లెక్స్‌లోని భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారాలు అందించనున్నారు. ఉత్సవాలలో ఆయా ఉత్సవాల విశేషాలు తెలిసే విధంగా తగు బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు, స్థానికులకు వైద్యసేవలు అందించే వీలుగా దేవస్థానం వైద్యశాలలో అవసరమైన మేరకు ఔషధాలను సిద్ధంగా ఉంచేలా ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలో ఆలయ ప్రాంగణం, ఆలయ పరిసరాలతో పాటు శివ వీధులలో (మాడవీధులలో) కూడా ఉత్సవ వాతావరణం ప్రతిబింబించే విధంగా ఆలయ ప్రాకార కుడ్యానికి కూడా విద్యుద్దీపాలంకరణ ఏర్పాటు చేశారు. ఉత్సవాల సందర్భంగా సంప్రదాయపద్ధతిలో తగిన విధంగా ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతీరోజూ నిత్య కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.