Srisailam | శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని దేవస్థానం ఈఓ పెద్దిరాజు తెలిపారు. రెండవరోజు ఉత్సవంలో భాగంగా శుక్రవారం అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్టాపారాయణాలు, చండీహోమం, పంచాక్షరీ, భ్రామరీ, చతుర్వేద పారాయణాలు, కుమారి పూజలు జరిపించారు. భ్రామరీ అమ్మవారిని సింహమండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై బ్రహ్మచారిణి రూపంలో అలంకరించి విశేష అర్చనలు, పూజలు నిర్వహించారు. నవదుర్గల్లో రెండవ రూపమైన బ్రహ్మచారిణి అమ్మవారు ద్విభుజాలు కలిగి కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలాన్ని ధరించి భక్తులకు దర్శనమిచ్చింది.
ఈ దేవుని పూజించడం వల్ల విశేష ఫలితాలతో పాటు సర్వత్ర విజయాలు లభిస్తాయి. బ్రహ్మచారిణి ఉపాసన వల్ల త్యాగ వైరాగ్య భావాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పబడింది. ఈ స్వరూపాన్ని సిద్ధులు ఎద్దులు ఎక్కువగా ఉపాసిస్తారు. అనంతరం అక్క మహాదేవి అలంకార మండపంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునులు మయూరవాహనాన్ని అధిష్టించి భక్తులను కరుణించారు. స్వామిఅమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరింపజేసి విశేష పూజలు, అర్చనలు నిర్వహించిన తరువాత గ్రామోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవ మూర్తులు మయూర వాహనంపై గంగాధర మండపం నుండి బయలు వీరబద్రస్వామి వరకు విహరిస్తూ భక్తాదులను కటాక్షించారు.
గ్రామోత్సవంలో నాదస్వరం, కేరళ చండీ మేళం, కొముకోయ నృత్యం, థయ్యం, విళక్కు, (సంప్రదాయ నృత్యం), స్వాగత నృత్యాలు, కోలాటం,రాజభటుల వేషాలు, జానపద పగటి వేశాలు, అశ్వ ప్రదర్శన, డమరుకం, చిడతలు, శంఖం, పిల్లన గ్రోవి, త్రిశూలం, జేగంట, కంచుడోలు, కొమ్ము, తాళాలు,
చెక్కభజన, అమ్మవారి వేశం, తప్పెట చిందు, డోలు విన్యాసం, వీరభద్ర డోలుకుణిత కన్నడ జానపదాలు తదిరత విన్యాసాలు భక్తులకు కన్నుల పండువగా నిలిచాయి.
ఉత్సవం తరువాత సువాసిని పూజ, కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు తీర్థప్రసాద వితరణ, ఆదిదంపతులకు ఆస్థానసేవ జరిపించారు. ఈ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు, పీఆర్వో శ్రీనివాసరావు, ఈఈ నర్సింహ రెడ్డి, శ్రీశైలప్రభ సంపాదకులు అనీల్ కుమార్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న పాల్గొన్నారు.
శరన్నవరాత్రుల్లో మూడవ రోజు శనివారం సాయంత్రం అమ్మవారు చంద్రఘంట అలంకారంలో దర్శనమివ్వనున్నారు. స్వామివారు రావణ వాహన సేవలో దర్శనం ఇస్తారని ఈఓ పెద్దిరాజు తెలిపారు.