అమరావతి : ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టుకు ( Srisailam Project ) ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో నీటి పారుదలశాఖ అధికారులు 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల(Jurala) , సుంకేశుల ( Sunkesula ) ప్రాజెక్టుల నుంచి వస్తున్న నీటితో శ్రీశైలంలోకి 2,10,286 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా 2,63,601 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.
పోతిరెడ్డిపాడు హెచ్ రెగ్యులేటర్ నుంచి 35 వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,344 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు. 6 స్పిల్‌వే గేట్ల ద్వారా 1,62,942 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను 883 అడుగులకు నీరు వచ్చి చేరిందన్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 215.80 టీఎంసీలకు ప్రస్తుతం 204.35 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.