AP News | గుంటూరు జిల్లాలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేస్తుండగా అక్కడికి వచ్చిన కొందరు మందుబాబులు వాటిని పట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఊహించని సంఘటనతో షాకైన పోలీసులు మందుబాబులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.
కొంతకాలంగా అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం బాటిళ్లను గుంటూరు పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి సీజ్ చేసిన మద్యం బాటిళ్లను నిల్వ ఉంచుతూ వస్తున్నారు. అయితే మద్యం బాటిళ్లు పెరిగిపోతుండటంతో వాటిని స్టోర్ చేయడం కూడా కష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారుల ఆదేశాలతో రూ.50లక్షల విలువ చేసే సుమారు 24వేల మద్యం బాటిళ్లను సోమవారం ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో ఏటుకూరు రోడ్డులోని నల్లచెరువులోని డంపింగ్ యార్డులో మద్యం సీసాలను ధ్వంసం చేశారు.
అయితే మద్యం సీసాలను తొక్కించేందుకు ప్రొక్లెయినర్ రావడం ఆలస్యమైంది. దీంతో పొక్లెయినర్ వచ్చి మద్యం సీసాలను తొక్కించడం ప్రారంభించిన కొద్దిసేపటికే అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మద్యం సీసాలను తొక్కిస్తున్నారనే విషయం తెలియడంతో అక్కడకు స్థానికులు పెద్ద ఎత్తున వచ్చారు. అధికారులు వెళ్లిపోవడంతో కొందరు మందుబాబులు అమాంతం అక్కడి నుంచి మద్యం బాటిళ్లను పట్టుకుని పారిపోయారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. వారి ముందే సీసాలు ఎత్తుకెళ్లారు. వీరిలో కొంతమందిని పోలీసులు పట్టుకుని నిలదీయగా.. వృథాగా నేలపాలు చేస్తుంటే.. చూస్తూ ఊరుకోలేకపోయాం సర్.. క్షమించండి అంటూ చెప్పుకొచ్చారు. కాగా, పారిపోయిన వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలో మందు బాబుల కక్కుర్తి..
పట్టుబడిన అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేస్తుండగా ఎగబడి ఎత్తుకెళ్లిన మందుబాబులు
గుంటూరు – పలు కేసుల్లో పట్టుబడిన రూ.50లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు ఏటూకూరు రోడ్డులోని డంపింగ్ యార్డ్లో ధ్వంసం చేశారు.
ఈ నేపథ్యంలో కొందరు మందుబాబులు… pic.twitter.com/eCVphKavxb
— Telugu Scribe (@TeluguScribe) September 9, 2024