తిరుమల : గుండెపోటుతో మరణించిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు రేపు (మంగళవారం) తిరుపతిలోని గోవిందధామంలో నిర్వహించనున్నారు. కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్లిన ఆయనకు సోమవారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది. దీంతో దవాఖానకు తరలించే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు.
డాలరు శేషాద్రి 1978 నుంచి శ్రీవారి సేవలో పాల్గొంటున్నారు. 2007లో పదవీ విరమణ చేసినప్పటికీ.. శేషాద్రి సేవలు తప్పనిసరి కావడంతో టీటీడీ ఆయనను ఓఎస్డీగా కొనసాగిస్తున్నది. తిరుమలలో పుట్టిన శేషాద్రి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అప్పట్లోనే ఆయన పీజీ చేశారు. డాలర్ శేషాద్రి తండ్రి తిరుమల ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించారు. ఆయన కూడా గుమస్తా నుంచి ఓఎస్డీ స్థాయికి ఎదిగారు. ఆయన హఠాన్మరణం పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.