Srisailam Temple | శ్రీశైలం : నంద్యాలలోని ప్రముఖ శైవ, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీలను లెక్కించారు. భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీలను మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా దేవస్థానానికి హుండీల ద్వారా రూ.3,61,42,016 నగదు ఆదాయం సమకూరిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఏప్రిల్ ఒకటి నుంచి 28 వరకు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను లెక్కించినట్లు పేర్కొన్నారు.
నగదుతో పాటు హుండీ ద్వారా 105 గ్రాముల బంగారం, 4.860 కిలోల వెండి సైతం వచ్చిందని చెప్పింది. అలాగే, 644 యూఎస్ డాలర్లు, 50 సౌదీ అరేబియా రియాల్స్, ఒకటి కువైట్ దినార్, 115 యూఏఈ దిర్హమ్స్, 670 యూకే పౌండ్స్, 54 సింగపూర్ డాలర్లు, 25 కెనడా డాలర్లు, 40 సౌత్ ఆఫ్రికా రాండ్స్, ఐదు ఘనాయన్ సెడీ, 2000 సెంట్రల్ ఆఫ్రికన్ ఫ్రాంక్, వంద ఒమన్ బైసా తదితర కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయని చెప్పారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్ రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.