Dharmavaram | ఉగ్రవాద కదలికలతో సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఉలిక్కిపడింది. ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహ్మద్ అనే యువకుడు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలతో ఫోన్లు మాట్లాడుతూ.. చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారంతో నూర్ మహ్మద్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఉపా యాక్ట్‌తో పాటు దేశద్రోహం కేసు నమోదైంది. జైషే మహ్మద్ సంస్థకు సంబంధించిన 29 ఉగ్రవాద సంస్థల గ్రూపుల్లో నూర్ కీలక సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే అతని సెల్‌ఫోన్‌ను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
నూర్ మహ్మద్ ధర్మవరం మార్కెట్ సమీపంలోని సల్మాన్ బిర్యానీ సెంటర్లో టీ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి నూర్ మహ్మద్ ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించిన పోలీసులు.. తెల్లవారుజామున అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంట్లో 16 సిమ్ కార్డులను, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. సిమ్ కార్డులు ఎలా కొనుగోలు చేశాడు? వాటితో పాక్ ఉగ్రవాద సంస్థల గ్రూపుల్లో ఎలా చేరాడు? ఎవరెవరితో చాటింగ్ చేశాడన్న విషయాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఆయా సమాచారం కోసం సిమ్ నెట్వర్క్ సంస్థల నుంచి సేకరించేందుకు అధికారికంగా మెయిల్స్ పంపిస్తున్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కలకలం..
నూర్ తో పాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పాకిస్తాన్ జెండాతో పాటు ఆ దేశానికి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సయ్యద్ బిలాల్ వీడియో అప్ లోడ్ చేసిన రియాజ్
ఎర్రగుంట ప్రాంతానికి చెందిన యువకుడు రియాజ్
అన్ని కోణాల్లో… https://t.co/sxTaWLJYG0 pic.twitter.com/D6xI19xacr
— BIG TV Breaking News (@bigtvtelugu) August 16, 2025
నూర్ మహ్మద్‌ను శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. కుటుంబ తగాదాల కారణంగా భార్య.. నూర్ మహ్మద్‌ను వదిలి వేరుగా ఉంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. అలాగే తాడిపత్రిలో ఓ మహిళతో నూర్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో తెలిసింది. దీంతో ఆ మహిళకు కూడా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణ అనంతరం నూర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి, కదిరిలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
నూర్ మహ్మద్‌తో పాటు మరో ధర్మవరంలోని ఎర్రగుంటకాలనీకి చెందిన రియాజ్ అనే ఆటో డ్రైవర్‌కు కూడా ఉగ్ర లింకులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాక్‌కు అనుకూలంగా వాట్సాప్ డీపీ పెట్టుకోవడంతో పాటు, పాకిస్థాన్ జెండాతో ఆ దేశానికి చెందిన సోషల్‌మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ సయ్యద్ బిలాల్ వీడియోను కూడా అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. దీంతో రియాజ్‌ను కూడా అదుపులోకి తీసుకుని డీఎస్పీ కార్యాలయంలో విచారిస్తున్నారు.