అమరావతి : ఏపీలో పోలింగ్ రోజు, తరువాత మూడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ (SIT) ఇచ్చిన నివేదికపై రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా (DGP Harish kumar) , రాష్ట్ర చీఫ్ సెక్రటరి జవహర్‌రెడ్డి (SC Jawahar reddy) తో భేటి అయ్యారు. మంగళవారం సీఎస్ కార్యాలయంలోకి వెళ్లిన డీజీపీ దాదాపు గంటపాటు సీఎస్‌తో పలు అంశాలపై చర్చిందారు.
అనంతపురం, తిరుపతి, పల్నాడు జిల్లాలో అల్లరు, విధ్వంసక (Violence) ఘటనలు, అభ్యర్థులపై దాడుల ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది . వెంటనే సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ జరిపి నివేదికను సీఎస్‌కు, డీజీపీకి, కేంద్ర ఎన్నికల సంఘానికి ( Chief Election Commission) పంపాలని ఆదేశించింది. సిట్ కు నాయకత్వం వహిస్తున్న బ్రిజ్‌లాల్ తన 12 మంది సభ్యులతో రెండురోజుల పాటు అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించడం పాటు బాధితులను, క్షతగాత్రులను, పోలీసులను, ఎన్నికల అధికారులను కలిసి విచారణ చేపట్టింది.
అనంతరం సోమవారం 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి అందజేసింది. ఈ రిపోర్టు ఆధారంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, అల్లర్లు జరుగడానికి అవకాశముండే ప్రాంతాలను గుర్తించి అక్కడ తీసుకోవాల్సిన భద్రత చర్యల గురించి ఇద్దరూ అధికారులు చర్చించినట్లు సమాచారం. అదేవిధంగా విధ్వంసకాండలో పోలీసుల పాత్ర, వారిపై శాఖాపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చకు వచ్చినట్లు తెలిసింది . మూడు జిల్లాలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఇప్పటికే కేంద్రం నుంచి అదనపు బలగాలను రాష్ట్రానికి రప్పించిన విషయం తెలిసిందే.