Srisailam | శ్రీశైలం : జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవుదినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్తీకమాసం వారాంతపు సెలవులు కావడంతో పరమశివుడి దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఉత్తర దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రికులు తెల్లవారుజాము నుంచి క్యూలైన్లలో బారులుదీరారు.
తెల్లవారుజుమున కృష్ణా నదిలో పుణ్య స్నానాలు చేసుకుని పసుపు కుంకుమలతో సారె సమర్పించి, కార్తీక దీపాలను వదిలారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు. స్వామివారి గర్భాలయ అభిషేకాలను మాసాంతం తాత్కాలికంగా నిలిపివేశారు. అదేవిధంగా అమ్మవారికి కుంకుమార్చనలు, చండీహోమం, రుద్రయాగం, నిత్య కల్యాణం కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు.
కార్తీక మాసం ప్రత్యేకంగా ఆలయ ఉత్తర మాఢవీధితోపాటు గంగాధర మండపం వద్ద మహిళలు అధిక సంఖ్యలో కార్తీక దీపాలను వెలిగించుకున్నారు. ఆలయ దర్శనాలు ప్రారంభమై ముగిసేంత వరకు ఉచిత ప్రసాద వితరణ, క్యూలైన్లలో దర్శనానికి వేచిఉండే భక్తులకు పాలు, మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం అందించినట్లు అధికారులు తెలిపారు.