Srisailam | శ్రీశైలం : కార్తీక మాసోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చిన భ్రమరాంబ దేవి, మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. కార్తీక తొలి సోమవారం సందర్భంగా ఆదివారమే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో శ్రీగిరులు సందడిగా మారాయి. వరుసగా రెండురోజులు సెలవులు రావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తడంతో శ్రీగిరి పురవీధులు కిటకిటలాడాయి.
సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల్లొ కేవలం అలంకార దర్శనం మాత్రమే ఉన్నందున దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలనుంచి అన్నదాన మహాప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు. క్షేత్ర పరిధిలోని పరివార ఆలయాలు పర్యాటక కేంద్రాలతోపాటు ఉద్యానవనాల్లో చిన్నారులు సందడి చేశారు. పలువురు భక్తులు కృష్ణానదిలో స్నానాలు చేసి కార్తీక దీపాలను వెలిగించి.. నదీమాతకు పూజలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ఆకాశ దీపాన్ని వెలిగించారు.
శ్రీశైల క్షేత్రానికి దర్శనార్ధం వచ్చే భక్తులు తమ వాహనాల్ల ఎలాంటి మత్తు పదార్థాలను తీసుకురావొద్దని ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న హెచ్చరించారు. టోల్గేట్ వద్ద ప్రతినిత్యం వాహన తనిఖీలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు. దేవస్థాన నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం వాహనాలను సీజ్ చేసి.. కేసులు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.