హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): వైకుంఠ ఏకాదశి వేళ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. వీఐపీలు భారీ సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. అంచనాలకు మించి భక్తులు వస్తుండటంతో టోకెన్లు లేనివారిని క్యూ లైన్లలోకి టీటీడీ అధికారులు అనుమతించడంలేదు. శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు ఉత్తర ద్వారం తెరచుకున్నది. రోజుకు 80 వేల మంది భక్తులకు వైకుంఠ దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. జనవరి 1 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శనం కల్పించనున్నారు.
ఈ నెల 27న వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆఫ్లైన్ టికెట్లు శుక్రవారం మధ్యాహ్నం నుంచి పంపిణీ చేస్తామని అధికారులు ముందుగా ప్రకటించడంతో భక్తులు గురువారం సాయంత్రం నుంచే భారీ సంఖ్యలో క్యూ కట్టారు. దీంతో గురువారం అర్ధరాత్రి నుంచే టోకెన్లు పంపిణీ చేశారు. ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతోపాటు వివిధ హైకోర్టుల నుంచి 35 మంది జడ్జిలు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శ్రీవారి దర్శన జాబితాలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో వస్తున్న ప్రముఖులకు వసతి కల్పించడం అధికారులకు సమస్యగా మారింది.