Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో పుర వీధులన్నీ కిటకిటలాడాయి. కార్తీక మాస శోభను సంతరించుకున్న శ్రీశైల మహాక్షేత్రం శివనామస్మరణతో మార్మోగింది. వరుసగా వారాంతపు సెలవులు కలిసి రావడంతో కుటుంబసమేతంగా క్షేత్రానికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించుకుని. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగాధర మండపం, ఉత్తర మాడవీధి వద్ద దీపాలు వెలిగించుకొని పూజలు చేసుకొన్నారు. అనంతరం భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనాలకు బారులుదీరుతూ ఉచిత దర్శనానికి రెండు గంటలు, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనానికి గంట సమయం పడుతున్నట్లు పీఆర్వో శ్రీనివాసరావు తెలిపారు. ఆలయ మాడవీధిలో సాయత్రం కళాకారులు చేసిన సంప్రదాయ నృత్యాలు అందరినీ అలరించాయి.
శని, ఆదివారాల్లో క్షేత్రానికి తరలివచ్చిన భక్తులు కుటుంబ సభ్యులతో బస చేసేందుకు సదుపాయాలు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవస్థాన వసతి గృహాలతో పాటు నిత్యాన్నదాన సత్రాల్లో
అద్దె గదులు, డార్మెటరీలు లభించక పోవడంతో ఉద్యానవనాలు, ఫుట్‌పాత్‌లపై నిద్రించడం కష్టంగా ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక పర్వ దినాల్లో సామాన్య భక్తులు కూడ బస చేసేందుకు
వీలుగా ప్రత్యేక వసతి సదుపాయాలను కల్పించాలని యాత్రికులు కోరుతున్నారు.