గుంటూరు: కరోనా వ్యాప్తి సమయంలో జన సైనికులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అందించిన సేవా కార్యక్రమాలు అపూర్వమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశంసించారు. కరోనాతో చనిపోయిన వారికి సభా వేదిక నుంచి సంతాపం ప్రకటించారు. రోడ్డు ప్రమాదాల్లో, అనారోగ్యం వల్ల, ప్రజాసేవలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ సభను అంకితం చేస్తున్నట్టు మనోహర్ తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు జనసేన అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఇప్పటం రోడ్లో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో నాదెండ్ల మనోహర్ ప్రారంభోపన్యాసం చేశారు.
జనసేన ఆవిర్బావ సభ ప్రాగంణానికి భారీగా జన సైనికులు తరలివచ్చారు. సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక అని పేరు పెట్టారు. ఏపీలో రాబోయేది జనసేన ప్రభుత్వమేనని.. పవన్ కల్యాణ్ సీఎం అవుతారని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్, ఇసుక మాఫియా రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. ఏపీ రాజకీయాల్ని మార్చే సామర్థ్యం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కే ఉన్నదని చెప్పారు.
జనసేన ఆవిర్భావ సమావేశం సందర్భంగా పవన్ కల్యాణ్ వీడియో సందేశాన్ని ఆ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఏపీ భవిష్యత్ కోసం జనసేన దిశా నిర్ధేశం చేయనున్నదని పవన్ కల్యాణ్ తన వీడియో సందేశంలో ప్రకటించారు. జనసేనపై వస్తున్న విమర్శలకు ఈ సభా వేదికగా సమాధానం చెప్తానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. కాగా, జనసేన అవిర్భావ సభకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.