అమరావతి : ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ ( Congress ) పార్టీ మహిళలను మోసం చేస్తునే ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (CM Chandrababu ) ఆరోపించారు. మహిళలను మోసం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో మహిళలను ఓటర్లుగా వాడుకోవడం తప్ప మహిళల కోసం చేసిందేమి లేదని విమర్శించారు.
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ( Reservation Bill) వీగి పోవడంతో ఎన్టీఏ పిలుపు మేరకు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో కూటమి నాయకులు నిరసన ర్యాలీ( Rally ) ని చేపట్టాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో చంద్రబాబు, కూటమి నాయకులు మాధవ్, కందుల దుర్గేశ్, సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్లు వస్తాయని ఎంతో ఆశతో ఉన్న మహిళలకు కాంగ్రెస్, మిత్ర పక్షాలు మహిళా బిల్లును అడ్డుకుని ద్రోహం చేశాయని మండిపడ్డారు. మహిళలను గౌరవించడం మన సంస్కృతి అని దీనికి భిన్నంగా వ్యవహరించాయని అన్నారు. ఎన్నో పోరాటాల తరువాత బిల్లు పార్లమెంట్‌కు వస్తే అడ్డుకోవడం దారుణమని అన్నారు. మహిళా బిల్లును అడ్డుకున్న రాజకీయ పక్షాలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలందరూ ఆత్మగౌరవం నినాదంతో ముందుకు పోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని స్వయాన ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా చెప్పినా రాజకీయ ఉద్దేశంతో బిల్లుకు అడ్డం పడడం క్షమించరాని నేరమని అన్నారు. ఏ ముఖం పెట్టుకుని మహిళల ఓట్లు అడుగుతారని నిలదీశారు. ఆడవారిని వంటింటికి మాత్రమే పరిమతం చేయాలని విపక్షాలు దుర్మార్గమైన ఆలోచన చేశారని ఆరోపించారు.