Srisailam Temple | శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు ఉత్సవాలు జరుగనుండగా.. దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో ప్రతిరోజూ అమ్మవారు ఒక్కో రూపంలో దర్శనమివ్వనున్నారు. అలాగే, ఒక్కో వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు. చండీహోమం, రుద్రహోమం, జపాలు, పారాయాణలు కొనసాగనున్నాయి. గురువారం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈవో పెద్దిరాజు దంపతులు, అర్చకులు, స్థానాచార్యులు, అర్చకస్వాములు, అధికారులు ఆలయ ప్రవేశం చేయగా.. ఉత్సవాలు మొదలయ్యాయి.
సంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమలు, ఫలపుష్పాదులతో ఆలయ ప్రవేశం చేశారు. ఉదయం 8 గంటలకు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాల ప్రవేశం, గణపతిపూజ, దీక్షాసంకల్పం, కంకణపూజ, కంకణధారణ, రుత్విగ్వరణం, కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారి యాగశాలలో అఖండదీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, చండీకలశస్థాపన, శ్రీచక్రార్చన, నవగ్రహజపాలు, చతుర్వేద పారాయణలు, చండీసప్తశతి, మహావిద్యా పారాయణలు, సూర్యనమస్కారాలు నిర్వహించారు. స్వామివారియాగశాలలో యాగశాలప్రవేశం, గణపతిపూజ, శివసంకల్పం, అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, రుద్రకలశస్థాపన క్రతువులు కొనసాగాయి.
ఈ సందర్భంగా లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పం పటించారు. అనంతరం ఉత్సవాలు నిర్విఘ్నంగ జరగాలని మహాగణపతిపూజ జరిపించారు. అమ్మవారి యాగశాలలో పుణ్యాహవాచనం, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధన, చండీకలశస్థాపన, శ్రీచక్రార్చన.. నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు జరిగాయి. స్వామివారి ఉత్సవాల్లో శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవాచనం, చండీశ్వరపూజ, రుత్విగ్వరణం, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధన, రుద్రకలశస్థాపన, జరిగాయి. అలాగే లోక కల్యాణార్థం రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు.
దసరామహోత్సవాలలో భాగంగా కుమారి పూజలు నిర్వహించారు. పూజలో భాగంగా రెండేళ్ల నుంచి పదేళ్లలోపు వయస్సు ఉన్న బాలికకు పూలు, పండ్లు, నూతనవస్త్రాలను సమర్పించి పూజించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇక సాయంత్రం అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగాయి. నవరాత్రి వేడుకల్లో తొలిరోజైన గురువారం అమ్మవారి శైలపుత్రి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఇక రాత్రి స్వామి, అమ్మవార్లు భృంగివాహన సేవపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. అంతకు ముందు స్వామిఅమ్మవార్లకు భృంగివాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.