Cyclone Montha | మొంథా తుపాన్ క్రమంగా బలహీనపడుతోంది. తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ భూభాగంపై కొనసాగుతోంది. దీని ప్రభావంతో తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
తుపాన్ ప్రభావంతో ఇవాళ ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, వివాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మొంథా తుపాన్ తీరం దాటిన కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉంది. రెండు మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగిసిపడుతూ లైట్‌హౌస్‌ను తీకుతున్నాయి. రాజోలు ప్రాంతంలో ఉదయం నుంచి భారీ ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. కాగా తుపాన్ ప్రభావంతో నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యాయి. రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను తొలగిస్తున్నారు.