హైదరాబాద్: మొంథా తుఫాను (Cyclone Montha) కాకినాడ వైపు దూసుకొస్తున్నది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాను, మరికొద్దిసేపట్లో తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని, దాదాపు 18గంటల పాటు ప్రభావం చూపనుందని పేర్కొంది. దీంతో కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
మొంథా తుఫాను ప్రస్తుతం మచిలీపట్నంకి 230కి.మీ. దూరంలో, కాకినాడకి 310కి.మీ., విశాఖకు 370కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు రికార్డయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విపత్తు నిర్వహణశాఖ అధికారులు సూచించారు. విజయవాడలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఏపీలో 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
కాకినాడ జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. తుఫాను ప్రభావంతో ఉప్పాడ తీరంలో భారీగా అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసమైంది. కెరటాల తీవ్రతకు భారీ రాళ్లు రహదారిపై ఎగసిపడుతున్నాయి. తీర ప్రాంత గ్రామాలపై అలలు విరుచుకుపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో కోతకు గురైన ఇండ్లు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా, కోనసీమ జిల్లావ్యాప్తంగా అర్థరాత్రి నుంచి వాన కురుస్తున్నది. దీంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పాడింది. సముద్ర తీరప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మొంథా తుపాను ప్రభావంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతికి వచ్చే 30కిపైగా విమానాలను రద్దు చేశారు. అదేవిధంగా 97 రైలు సర్వీసులు రద్దయ్యాయి. ఇక విశాఖకు వచ్చే 16 రైళ్లను అధికారులు క్యాన్సల్ చేశారు. ఇండిగో, ఎయిరిండియా సంస్థలు కూడా తమ విమాన సర్వీసులను రద్దు చేశాయి.
Bulletin 1,2,3,4 – Cancellation/Diversion of Trains due to #CycloneMontha 📢@RailMinIndia @drmvijayawad @drmgnt @drmsecunderabad @drmhyb @drmgtl @DRMWaltairECoR @EastCoastRail pic.twitter.com/3YKVDtC3Lp
— South Central Railway (@SCRailwayIndia) October 27, 2025