తిరుమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ పెరిగింది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టీబీసీ క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. నిన్న శ్రీవారికి 21,560 మంది తలనీలాలు సమర్పించారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 2.97 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. కాగా తిరుపతిలోని తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి అమ్మవారు మహారాణీ అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. వాహనసేవల్లో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో జె.శ్యామలరావు, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్ పాల్గొన్నారు.