అమరావతి : అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోను 90శాతం మంది టీడీపీ ఎమ్మెల్యేల (TDP MLAs) అవినీతి(Corruption) పరాకాష్టకు చేరుకుందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి(MP Vijayasai Reddy) ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక ప్రభావం కనిపిస్తుందని ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా ఆరోపించారు.
అధికారులు, ఉద్యోగుల పోస్టింగులకు ఒక రేటు, మద్యంలో నెలమామూళ్లు, వెంచర్లలో కమీషన్లు, కాంట్రాక్టర్ల దగ్గర పర్సెంటేజిలు, ప్రొటెక్షన్ మనీ అంటూ బరితెగించారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ గూఢచారులుగా ప్రవర్తించిన అధికారులకు క్లీన్ చిట్లు, మంచిరాబడి ఉన్న పోస్టింగులు, పదోన్నతులు ఇస్తున్నారని మండిపడ్డారు. మద్యంషాపుల దరఖాస్తుల్లో టీడీపీ ఎమ్మెల్యేలు సిండికేట్ అయ్యి సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నారని విమర్శించారు.
లిటిగేషన్లు, నోటిదురుసులు, వ్యభిచారాలు, ఆమ్యామ్యాలు, మాఫియాలు, దందాలు, బ్లాక్మెయిలింగ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఐదు సంవత్సరాల తర్వాత అవకాశం దొరికినప్పుడు మేం మింగితే తప్పేమిటి. మళ్లీ అవకాశం వస్తుందో రాదో అన్న అనుమానంతో విచ్చలవిడితనానికి తమ్ముళ్లు ఎగబడుతున్నారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలఫై చంద్రబాబు స్పందించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ప్రజాభీష్టం మేరకు శ్వేతపత్రం సమర్పించి విచారణకు ఆదేశించాలన్నారు.