అమరావతి : విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ (Prakasam barrage) కి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. వరద నీరు అధికంగా ఉండటంతో బ్యారేజీ 40 గేట్లు ఆరు అడుగుల మేర , 30 గేట్లు ఏడు అడుగుల మేరఎత్తి 2,74,200 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజీ 2,88,191 క్యూసెక్కులుగా ఉంది. కాలువలకు 13,991 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు రిజర్వాయర్(Tammileru reservior) లో వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇన్ ప్లో 5256 క్యూసెక్కులు,అవుట్ ఫ్లో 5688 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 355 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 349.49 అడుగులకు చేరింది.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కొంగువారిగూడెం ఎర్రకాల్వ జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు కాగా, ప్రస్తుతం 82.30 మీటర్ల నీటిమట్టం చేరుకుంది. ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుతం ఆరువేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ద్వారా 6500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.