అమరావతి: చలిగాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వేళల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడు తున్నారు. ఇదిలా ఉండగా మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరుగుతుందని అంచనా. కాగా ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.
గత నాలుగైదు రోజులుగా వాతావరణంలో విపరీతమైన మార్పు వచ్చిందని,మంచు కురుస్తుండ టంతో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ కేంద్రం తెలిపింది. పాడేరు,చింతపల్లి,అరకు, మినుములూరు, లంబసింగి ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి పది గంటల వరకు చలిగాలుల తీవ్రత,పొగమంచు కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 6.2 డిగ్రీలసెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.