 
                                                            ‘కూసోర్రి, కూసోర్రి. ఏమయ్యా సెగెట్రీ మీటింగ్ హాల్లో మన మెంత్రులందరూ ఎక్కడోళ్లక్కడ గూసుంటే నువ్వేంటయ్య మూలగ్గూసొని సెల్ఫోన్ జూస్తున్నవ్, కొంపదీసి మా మెంత్రుల మాటల్నేమైనా రికార్డు జేస్తున్నవా ఏంది?’, ‘హెంతమాట సార్? నమ్మకానికి అంగీ తొడిగి, లాగేస్తే అది మీ సెగెట్రీ సార్. అలాంటి నన్ను వట్టుకొని అనుమానించడం మీకు న్యాయమెట్లయితది సార్?
అయినా రికార్డు జేయడానికి మన మెంత్రుల దగ్గర మాటలేమున్నయి సార్? అద్దగంటాయె అందరు మెంత్రులొచ్చి (ఒక్క మెంత్రి దప్ప) ఒక్కరి నోటి నుంచి ఒక్క మాట రావడం లేదు. అందరూ ఏడ్పు మొహం వెట్టుకొని మీ రాక కోసం ఎదిరిజూస్తున్నరు. ఒక్క మెంత్రితో మాట్టాడితే ఇంకో మెంత్రి గుస్సా ఐతడని ఎవ్వలతోని మాట్టాడకుండ సెల్ఫోన్లో రీల్స్ జూస్తున్న. అన్నట్టూ, ఆ ఆంధ్రా కపుల్స్ (చుప్పు చుప్పు, చుప్పు చుప్పు..) రీల్స్ అద్రగొడ్తున్నరు సార్’
‘ఔనా, హో వెరీగుడ్. సెగెట్రీ నీకెన్నిమాట్ల శెప్పాలె. కుర్సీ అంతపైన ఉంటే నేనెట్లా కూసుంటనయ్య దాని మీద? జప్పన కుర్సీ కిందికను.’, ‘మీరు శెప్పినట్టే నేన్జేశాన్ సార్. మన మెంత్రులందరికీ మీరు కనవడాల్నని ఎప్పట్లెక్కనే కుర్సీ పైకన్న సార్’., ‘నువ్వు జేసింది కరెస్టేనయ్యా సెగెట్రీ, కనీ, నేను గూసున్నంక కదా నువ్వు కుర్సీని పైకనాలి. అయినా, కుర్సీని పైకనుమన్నది నేను అందరికి కనవడాల్నని కాదయ్యా సెగెట్రీ, మెంత్రులెవ్వలికీ ఆ కుర్సీ అందకూడదని! ఆ కుర్సీ ఎవ్వలకందనంత ఎత్తున ఉండాలి, దానిపై నేనొక్కన్నే గూసోవాలి. హా, ఇప్పుడను పైకి.’, ‘ఓకే సార్, ఇక నుంచి అట్లనే జేస్త..’
‘మెంత్రులందరొచ్చినట్టేనా? ఇగ మీటింగ్ షురూ జేస్కుందామా?’, ‘ఈ గున్నపోతు ఇంకా రాలేదు గదా సార్?, ఈ గున్నపోతు ఎప్పుడు ఆలస్యంగనే అస్తది’, ‘కన్నం బ్రో.. ఒక మెంత్రిని వట్టుకొని మీరట్ల గున్నపోతని మాట్టాడటమేం బాలేదు. ముందునుంచి నీకు శెప్తనే ఉన్న నోరును అదుపుల వెట్టుకోవాల్నని’, ‘ముక్కమెంత్రి గారికి నమస్తే..’, ‘రావయ్యా రా మడ్లూరి. అట్ల గూసొ. సెగెట్రీ మన మెంత్రి గారికి ఓ కుర్సీ ఎయ్’, ‘ముక్కమెంత్రి గారు నేను జూనియర్నే గావొచ్చు. కానీ, నేనూ మెంత్రిననే ఇషయం మర్శిపోయి, నన్ను గున్నపోతని తిట్టడమేం బాలేదు.
ఈ మెంత్రి నన్నట్లా తిడితే జనాల దగ్గర నాకేమన్న ఇజ్జతుంటదా? ఆ మెంత్రి నన్ను గున్నపోతనంగ ఇన్న ఇంకో మెంత్రి నవ్వుకుంట ఉండటం అన్యాయం సార్. ఆళ్లిద్దరు నాకు సారీ శెప్పేదాన్క నేను గూసోను సార్..’, ‘ముక్కమెంత్రి గారు ఈ మెంత్రి గమ్మతున్నడు సార్? తిట్టినాయెన మంచిగనే ఉన్నడు, తిట్లువడ్డ ఈ మెంత్రి గూడ మంచిగనే ఉన్నడు, మజ్జల నేనేమన్న సార్? ఆ మెంత్రి తిట్టంగ నేనినడం తప్పా, ఇనకుండా శెవులు మూస్కోవాల్నా ఏంది. నేను శెవులు మూస్కుంటె పెజల సమస్యలెట్ల ఇనవడ్తయి సార్ నాకు? అయినా నేనెందుకు సార్, సారీ శెప్పుడు. నేనస్సల్కే జెప్ప, ఏం జేస్కుంటడో జేస్కొమ్మను.’, ‘మడ్లూరి బ్రో, కాళ్లు న్యాలకు గొట్టుడు ఆపండి, ప్లీజ్. ఆళ్లతోని నీకు సారీ శెప్పిచ్చే బాధ్యత నాది. నా మాటిని నువ్వు గూసుంటవా, గూసోవా?’, ‘ఓకే ముక్కమెంత్రి గారు మీరంతలా ఒర్లి శెప్తున్నరు గావట్టి, మీ మాటకు నేను గౌరవం ఇస్తున్న. లేకుంటెనా?’
‘ముక్కమెంత్రి బ్రో మీరే శెప్పండి. ఆ సీట్ల, అందనంత ఎత్తున మీరు గూసున్నరంటె దానికి కారణం నేను కాదా? ఉప్పుకో, పప్పుకో.. అప్పుడు నేను అప్పు ఇస్తనే గదా మీరియ్యాల ముక్కమెంత్రి అయ్యిన్రు. అధికారంలకచ్చినంక నేనిచ్చినదానికి మూడింతలు నాకు ముట్టజెప్పిన్రు అది ఏరే ఇషయం. కానీ, నన్నిప్పుడు మర్శిపోవుడు అన్యాయం బ్రో?’, ‘గులేటి బ్రో.. నిన్నేం మర్శిపోలేదే. నీకు నువ్వే అట్లా మనాది వడ్తున్నవ్?’, ‘నన్నంతగనం దిట్టిన మెంత్రిని నువ్వు మళ్లా గల్శినవంటే నన్ను మర్శిపోయినట్టే గదా బ్రో. పైగా, ఆ మెంత్రిని నువ్వు భర్తరఫ్ జేస్తవనుకుంటే, భర్తతో కల్శి అచ్చిన ఆమెకు స్వీట్లు తినవెట్టి మరీ ఇంటికి పంపినవ్. కనీసం ఆమెకు శెక్కెర వోసేటప్పుడన్నా నీకు నేను గుర్తు రాలేదా బ్రో?’, ‘గులేటి బ్రో.. మన కడుపు శింపుకుంటే పేగులు మన కాళ్లమీన్నే వడుతయి. ఆమె నిన్నే గాదు, నన్ను గూడ తిట్టింది. ఐనోళ్లతోని, కానోళ్లతోని కొన్నిసార్లు అట్లా తిట్లు వడాల్సొస్తది. సూసీ సూడనట్టు పోవాలె. అవన్నీ పట్టించుకుంటే నాకీ సీటు, నీకా సీటు, మనకే సీటూ మిగులదు బ్రో.’
‘ముక్కమెంత్రి గారు సారీ, వెరీ వెరీ సారీ. ఇంకోసారి నిన్ను గాదు, గులేటన్నను, కన్నమన్నను, దద్దులన్నను.. ఎవల్నీ తిట్టను. ఆ తిట్లు మన్సుల వెట్టుకొని నా మెంత్రి పదవికి మాత్రం అన్యాయం జేయొద్దు బ్రో’, ‘కుండక్కా.. నేనీ మీటింగ్ వెట్టింది నీ మెంత్రి పదవి ఊడవీకడానికో, పెజా సమస్యల మీద సర్చించడానికో, లేకుంటే స్థానిక ఎలచ్చన్ల మీన ముచ్చట వెట్టడానికో కాదు. మన మెంత్రులందరం కల్శిమెల్శి ఉండాలె అన్జెప్పడానికి వెట్టిన. మెంత్రులందరు ఒగల్నొగలు తిట్టుకుంటా ఉంటే పెజలల్ల పల్సగైపోతున్నం. ముక్కెంగా వాటాల ఇషయంల లొల్లి వెట్టుకొనుడు మాత్రం గలీజుగున్నది. కాబట్టి, ఇగనన్న మనందరం ఒక్క కుటుంబమోలె కల్శిమెల్శి ఉండాలె. ఇదే నేటి మీటింగ్ ముక్కాంశం. ఓకేనా?’, ‘ఓకే సార్. ఓకే సార్. ఓకే బ్రో..’, ‘ఇప్పుడందరు నవ్వండి, ఒగలికొగలు శెయ్యిల శెయ్యిచ్చుకోర్రి’. ‘ఓకే బ్రో..’, ‘ఇగ నడువుర్రి, నడ్శి ప్రెస్సు మీటింగ్ వెట్టుర్రి.’
‘మేడం, మేడం. సార్, సార్..’, ‘మీడియా మిత్తురులకు నమెష్కారం, నేటి మీటింగ్ ముక్కాంశం ఏమంటే డజన్లకొద్దీ పిల్లలున్నా స్థానిక ఎలచ్చన్లల్ల పోటీ జేయొచ్చు.’, ‘మేడం, ఇంతకీ ఎలచ్చన్లెప్పుడు మేడం?’, ‘పతిపక్షం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమల్జేసినప్పుడు..’, ‘అదేంది మేడం, అధికారంల మీరుంటే 42 శాతం రిజర్వేషన్లు పతిపక్షపోల్లు ఎట్లా అమల్జేస్తరు?’, ‘అబ్బ రిపోర్టరూ… సెంటర్ల పతిపక్షంలున్నది మేమే గదనయ్యా?’, ‘హో, ఓకే ఓకే. ఇంతకీ మెంత్రుల చిటపట గురించి ముక్కమెంత్రి ఏమైనా శెప్పిన్రా మేడం?’, ‘పతిపక్షాలు మంత్రాలు జేయడం వల్లే మెంత్రుల మజ్జ లొల్లులవుతున్నయనేది ముక్కమెంత్రి గారి తువాచ. రిపోర్టరూ.. అయినా, కుటుంబం అన్నంక లొల్లులు కామన్. తిట్టుకుంటం, అవసరముంటే కొట్టుకుంటం గూడ..’, ‘ఓకే, ఓకే మేడం. ఆల్ ద బెస్ట్…’
– గడ్డం సతీష్ 
99590 59041
 
                            