అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 25న కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. అన్నంపల్లి ప్రాజెక్టును కూడా సందర్శించి అక్కడి నష్టాన్ని తెలుసుకుంటారు. కాగా, అనకాపల్లి జిల్లాలో డిప్యూటీ మంత్రి ముత్యాల నాయుడు పర్యటించారు. తెనుగుపూడి గ్రామాన్ని సందర్శించి స్థానికులతో సమస్యలను అడిగి తెల్సుకున్నారు.
వరద కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న కోనసీమ జిల్లాలో సీఎం జగన్ సోమవారం పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు. ఈ జిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసి తయారుచేసే నివేదికను సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి అందజేసి సాయం కోరనున్నారు. సీఎం జగన్ రాక సందర్భంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పీ గన్నవరంలోని హెలిప్యాడ్‌ను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాలో దెబ్బతిన్న పంటలను సీఎం జగన్ సందర్శించిన తర్వాత అక్కడి నుంచి అన్నంపల్లి అక్విడెక్ట్ ప్రాజెక్టుకు చేరుకుంటారు. వరదలకు ఈ ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని తెలుసుకుంటారని అధికారులు తెలిపారు.
తెనుగుపూడిలో డిప్యూటీ సీఎం పర్యటన
అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం తెనుగుపూడి గ్రామాన్ని డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు సందర్శించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మమేకమై గ్రామంలోని ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏదైనా కారణాల వల్ల అర్హులైన వారు పథకాలను పొందడంలో విఫలమైతే, తిరిగి దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయ సిబ్బందిని మరోసారి విచారించి అర్హులకు పథకాలు అందేలా చూస్తామని చెప్పారు. ఆయన పర్యటనలో భాగంగా తెనుగుపూడి గ్రామ శివారులో రూ.47 లక్షలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు బీ బాబూరావు, మండల పరిషత్ అధ్యక్షులు కే భాస్కరరావు, జెడ్పీటీసీ సభ్యులు కే సత్యనారాయణతోపాటు మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.