అమరావతి: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ మంది వస్తారని తెలిసినా ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేందంటూ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని చెప్పారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని అధికారులు ప్రశ్నించారు. తొక్కిసలాటపై డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. తిరుపతి లాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని మండిపడ్డారు. మృతుల సంఖ్య పెరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై ఆరాతీశారు. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునఃసమీక్షించాలని స్పష్టం చేశారు. కాగా, గురువారం తిరుపతికి వెళ్లనున్న చంద్రబాబు.. తొక్కిసలాట ఘటన క్షతగాత్రులను పరామర్శించనున్నారు. మరోవైపు ముగ్గురు మంత్రులను హుటాహుటిన తిరుపతికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు.
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మరో 40 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వీరిలో 34 మందికి రుయా, స్వీమ్స్ దవాఖానల్లో చికిత్స అందిస్తున్నారు. వైకుంఠద్వార దర్శనం టోకెన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా జారీచేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తిరుపతికి చేరుకున్నారు.
భక్తులను బైరాగిపట్టెడ వద్ద పద్మావతి పార్కులో ఉంచారు. టోకెన్ల కేంద్రంలోని సిబ్బందిలోని ఒకరు అస్వస్థతకు గురికావడంతో దవాఖానకు తరలించేందుకు క్యూలైన్ తెరిచారు. టోకెన్లు జారీ చేసేందుకే క్యూలైన్ తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. తమిళనాడు సేలంకు చెందిన మహిళ విష్ణు నివాసం వద్ద టోకెన్లు తీసుకునేందుకు ప్రయత్నించారు. భక్తుల మధ్య ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. గాయపడిన మల్లిక అనే మహిళను ముందుగా ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి రుయా దవాఖానకు తరలిస్తుండగా మర్గమధ్యంలో మృతిచెందారు. మిగిలిన క్షతగాత్రులను సిమ్స్, రుయాకు తరలించారు. రుయాలో చికిత్సపొందుతూ మరో ఐదుగురు భక్తులు మృతిచెందారు.