తిరుపతి : తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాలను (Brahmotsavam) విజయవంతం చేయడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సోమవారం టీటీడీని ఎక్స్ ట్విటర్ (Twitter) ద్వారా అభినందించారు. ‘తిరుచానూరులో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల దివ్య వైభవాన్ని వీక్షించడం ఆనందంగా ఉందన్నారు.
ఆధ్యాత్మిక ఉత్సాహంతో, మన సంప్రదాయాలు ఉట్టిపడేలా జరిపారని కొనియాడారు. టీటీడీ ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేసుకుని క్షేత్ర స్థాయిలో అమలు చేయడం వల్ల భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు అందేలా చేశారని ప్రశంసించారు.
తిరుచానూరులో వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28న ప్రారంభమై డిసెంబర్ 6న ముగిశాయి. పంచమీ తీర్థం సందర్భంగా పవిత్ర పద్మ పుష్కరిణిలో వేలాది మంది భక్తులు పంచమి తీర్థ స్నానం ఆచరించారు. టీటీడీ చేసిన ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేయడం పట్ల చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.