న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: జంక్ ఫుడ్స్ కూడా సిగరెట్ల లాంటివేనని, వాటికి కఠిన నియమాలు అవసరమని తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు(యూపీఎఫ్) ప్రజారోగ్యంపై హానికరమైన ప్రభావాలను కలిగి ఉన్నందున సిగరెట్ల మాదిరిగానే వాటిని నియంత్రించాలని కొత్త అధ్యయనం సూచించింది. యూపీఎఫ్-పొగాకు ఉత్పత్తులకు మధ్య సారుప్యతలు ఉన్నాయంటూ హార్వర్డ్, మిచిగన్, డ్యూక్ వర్సిటీల పరిశోధకుల బృందం తేల్చింది.
వీరి అధ్యయనం ప్రకారం, యూపీఎఫ్లు పారిశ్రామికంగా తయారుచేసిన ఆహార పదార్థాలు. ఇవి కృత్రిమ రుచులు, రంగులు, ఎమల్సిఫైయర్లు కలిగి ఉంటాయి. సిగరెట్లు, యూపీఎఫ్లు రెండూ ఉద్దేశపూర్వకంగా పదే పదే వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూపొందించినవి. వినియోగదారుల మెదడును ప్రభావితం చేసేలా ఉత్పత్తిదారులు యూపీఎఫ్లను తయారుచేస్తున్నారు. దీనికితోడు వారు అనుసరిస్తున్న మార్కెటింగ్ పద్ధతులు కూడా సరైనవి కావని అధ్యయనం తెలిపింది.