సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోయిన్లలో ఈషా రెబ్బా ఒకరు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో నటిగా పరిచయమై..‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో మంచి హిట్ అందుకుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తెలుగు, తమిళం, మళయాళ ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా తరుణ్ భాస్కర్‌తో కలిసి ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అంటున్న ఈ టాలీవుడ్ బ్యూటీ పంచుకున్న కబుర్లు ఇవి..
కొంత గ్యాప్ తర్వాత త్రీ రోజెస్ వెబ్ సిరీస్‌లో నటించా. సీజన్1లో నేను, హర్ష చేసిన సీన్లు వైరల్ అవుతాయని
ఊహించలేదు. ఆ సక్సెస్‌తోనే సీజన్ 2 బాగా చేశాం.
నేను వరంగల్‌లో పుట్టినా.. చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. కాలేజీలో ఉన్నప్పుడే మోడలింగ్‌లోకి ప్రవేశించా. ఆ తర్వాత సినిమాల్లోకి రావాలనే కుతూహలంతో ఆడిషన్లకు పోయాను. అలా శేఖర్ కమ్ముల చిత్రంలో తొలిసారిగా కనిపించాను. కొన్నాళ్లకు ‘అంతకు ముందు ఆ తరువాత’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాను.
‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమాలో తరుణ్ భాస్కర్‌తో కలిసి చేశాను. ఆయనతో నేను ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. వీటిని చూసి మా నాన్న కూడా ‘పెళ్లెప్పుడు?’ అని అడుగుతున్నారు. నేను ఒకరితో డేట్లో ఉన్న మాట వాస్తవమే! కానీ, అది ఇప్పటివరకైతే పెళ్లి దాక వెళ్లలేదు. ఆ వ్యక్తి ఎవరన్నది సమయం వచ్చినప్పుడు నేనే చెప్తా.
కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఒక సినిమా కోసం ఫోటో షూట్ జరిగినప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ ప్రవర్తించిన తీరు నన్ను షాక్‌కు గురిచేసింది. ఆయన నా ఫొటోలను అంగుళం అంగుళం జూమ్ చేసి చూస్తూ..‘నీ మోచేతులు నల్లగా ఉన్నాయి. నువ్వు ఇంకా తెల్లగా ఉండాలి’ అంటూ అవమానకరంగా మాట్లాడటం నన్ను ఎంతగానో బాధించింది.
సినిమాల్లో గ్యాప్ రావడం వల్ల చాలా మంది ‘సినిమాలు చేయడం మానేశారా’? అని అడిగేవారు. మంచి కథలు వచ్చినప్పుడే ఓకే చెబుతున్నా. ‘ఓం శాంతి శాంతి శాంతిః’ లాంటి సినిమాలో నటించే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. అందుకే కథ వినగానే ఒకే చెప్పా.
కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు గతంలో చాలా తక్కువ వచ్చేవి. ఇప్పుడు వాటి సంఖ్య పెరిగింది. ఫీమెల్ ఓరియెంటెడ్ కథలు వచ్చినప్పుడు.. ఆ పాత్రను రిలేట్ చేసుకోగలిగితే ఒప్పుకొంటా. యాక్షన్ మూవీస్ చేయాలని ఉంది. లాక్డౌన్ టైమ్‌లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా.
అవకాశాలు రావాలంటే ‘ఈవెంట్లకు వెళ్లాలని, తెలుగు అమ్మాయి అని చెప్పుకోకూడద’ని కొంతమంది సలహాలు ఇచ్చారు. నేను నా టాలెంట్‌ను నమ్ముకున్నా. ఎవరినో మెప్పించాల్సిన అవసరం నాకు లేదు.