మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భూత్పూర్ : కేసీఆర్ నాట్లు వేసే టైంలో రైతుబంధు ఇస్తే.. రేవంత్‌రెడ్డికి ఓట్లు ఉన్నప్పుడే రైతు భరోసా గుర్తుకు వస్తుందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సింగాపూర్, షేర్‌పల్లి, గోప్లాపూర్ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ప్రపంచంలో ఎవరూ ఆలోచన చేయని విధంగా రైతుబంధును అందించి అన్నదాతలకు అండగా నిలిచారని గుర్తించారు.
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 11 సార్లు రైతుబంధును వేశామని.. కరోనా కష్టకాలంలో కూడా రైతులు ఇబ్బందులు పడొద్దు అని పెట్టుబడి సాయం అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కేసీఆర్ రూ.10 వేల రైతుబంధు ఇస్తున్నాడు.. మేము అధికారంలోకి వస్తే రూ.15 వేలు ఇస్తాం.. మూడు పంటలకు ఇస్తామని మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను ఇవ్వకుండా రైతులకు దగా చేస్తుందన్నారు. మొన్న పంచాయతీ ఎన్నికల అప్పడు గుర్తొచ్చిన రైతుభరోసా.. మళ్లీ మున్సిపల్ ఎన్నికల అప్పుడు గుర్తొచ్చిందని… ఎద్దేవా చేశారు.
అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిందన్నారు. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అన్ని తండాలకు పన్నెండున్నర కోట్ల రూపాయలతో రోడ్లు వేసినం అని గుర్తు చేశారు. 50 కోట్లతో భూత్పూర్ మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులు చేశామన్నారు. రూ.రెండేళ్లుగా భూత్పూర్కు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించలేదని ఆయన విమర్శించారు. మరోసారి బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వండి… కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను ఆశీర్వదించండి అని ఓటర్లను అభ్యర్థించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. ప్రజలు ఆలోచించి ఓటు వేయలన్నారు.
ముఖ్యంగా మహిళలకు రూ.2,500 లేదు.. తులం బంగారం లేదు.. రూ.4 వేల పింఛన్ లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు బాకీ పడిందని ప్రచారానికి వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే బుద్ధి వస్తుంది.. ఎన్నికల్లో ఓడిపోతే కనీసం హామీలు అమలు చేయాలన్నా సోయి ప్రభుత్వానికి వస్తుందన్నారు. అసాధ్యమైన హామీలు ఇచ్చారు.. వచ్చే రెండున్నర ఏండ్లలో కూడా వాటి అమలు సాధ్యం కాదు కాబట్టి ఓటర్లు బీఆర్ఎస్కే ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బసవరాజ్‌గౌడ్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.