తిరుమల : తిరుమలలో లడ్డూ (Laddus ) విక్రయాలపై టీటీడీ (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. దాని అమలును గురువారం నుంచే ప్రారంభించింది. టోకెన్లు, టికెట్లు లేని భక్తులు ఆధార్ చూపిస్తేనే వారికి లడ్డూలను అందజేస్తామని స్పష్టం చేసింది. దళారుల బెడదను అరికట్టి ,లడ్డూ ప్రసాదాలను పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి(Venkaiah Ch అన్నమయ్య భవనం వద్ద మీడియాకు వెల్లడించారు.
దర్శనం టోకెన్లు లేని భక్తులకు ఆధార్ తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సామాన్య భక్తుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. భాగంగా గురువారం ఉదయం నుండి దర్శనం టోకెన్లు లేని భక్తులు లడ్డూ కౌంటర్లలో తమ ఆధార్ కార్డును నమోదు చేసుకొని రెండు లడ్డూలు పొందవచ్చని సూచించారు. ఇందుకోసం లడ్డూ కాంప్లెక్స్ 48 నుంచి 62 నెంబర్ల కౌంటర్లలో లడ్డూలు పొందవచ్చన్నారు.
దర్శనం టోకెన్లు లేదా టిక్కెట్లు కలిగిన భక్తులు ఒక ఉచిత లడ్డూతో పాటు గతంలోవలే అదనపు లడ్డూలు కొనుక్కోవచ్చని సూచించారు. గతంలో కొందరు దళారులు లడ్డూలు కొనుగోలు చేసి, భక్తులకు అధిక ధరల విక్రయించినట్లు టీటీడీ గుర్తించిందని వివరించారు. దీనిని అరికట్టేందుకు గురువారం నుంచి రోజువారీ టోకెన్ లేని ప్రతి భక్తునికి ఆధార్ పై రెండు లడ్డూలు మాత్రమే ఇవ్వాలని టీటీడీ నిర్ణయించిందన్నారు.