తిరుమల : రేపటి చంద్రయాన్ -3 ప్రయోగం సఫలం కావాలని ఇస్రో శాస్త్రవేత్తల బృందం తిరుమలలో
ని శ్రీ వేంకటేశ్వర స్వామిని గురువారం దర్శించుకుంది. ఈ సందర్భంగా చంద్రయాన్-3 సూక్ష్మ నమూనాను శ్రీవారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. నింగిలోకి వాహన ప్రయోగాలకు ముందు రోజు ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమలను దర్శించుకుంటున్నారు.
శుక్రవారం నింగిలోకి పంపనున్న చంద్రయాన్-3 ( Chandrayan -3) తిరుపతి జిల్లా శ్రీహరికోట (Srihari kota) లోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లో గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు కౌంట్ డౌన్ (Countdown) ప్రారంభమయ్యింది. చంద్రుడిపై అన్వేషణ కోసం ఇస్రో (ISRO) చంద్రయాన్ – 3ను ప్రయోగిస్తుంది. దాదాపు 25 గంటల అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 2.35.13 గంటలకు చంద్రయాన్ నింగిలోకి వెళ్లనుంది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్ సమయంలో విఫలమయ్యింది.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేందుకు ఇస్రో ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రయాన్-3లో ఇంధన పరిమాణాన్నీ పెంచుతూ ల్యాండింగ్‌కు కొంత విశాలమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు అమెరికా, చైనా, రష్యా దేశాలు చంద్రుడి ఉపరితలంపై వాహన నౌకలను పంపాయి. భారత్ పంపన్న చంద్రయాన్ -3తో నాలుగో దేశంగా కీర్తి గడించనున్నది.