అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) కి తృటిలో రైలు ప్రమాదం(Rail Incident) తప్పింది. భారీ వర్షాలతో విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు నీట మునగడంతో ఆ ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తున్నారు. బాధితులను పరామర్శించడానికి గత ఐదురోజులుగా విస్తృతంగా పర్యటన కొనసాగిస్తున్నారు.
దీంట్లో భాగంగా గురువారం విజయవాడలోని మధురానగర్ రైల్వేట్రాక్ కింద ఉన్న వాగును పరిశీలించేందుకు నడిచివెళ్తుండగా ఒక్కసారిగా అటువైపు నుంచి రైలు వచ్చింది. దీంతో ట్రాక్ పక్కనే చంద్రబాబు, అధికారులు, భద్రత సిబ్బంది నిలబడిపోయారు. రైలు వెళ్లిపోయిన తరువాత అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం చంద్రబాబు తన పర్యటనను కొనసాగించారు.