అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో పాటు, పలువురు కేంద్ర మంత్రులను శనివారం సాయంత్రం కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తో భేటీ అయిన చంద్రబాబు మోదీని సన్మానించి రాష్ట్రంలో చేపట్టిన పనుల పురోగతిని, అందుకు కేంద్రం నుంచి కావాల్సిన సహాయాన్ని కోరారు. ఈ సందర్భంగా ప్రధానికి వినతి పత్రం అందజేశారు.
రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణం పూర్తికి, పోలవరం ప్రాజెక్టు (Polavaram) కు ఇదివరకే ప్రకటించిన విధంగా ఆర్థిక సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. దాదాపు గంటపాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం . అనంతరం చంద్రబాబు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman)ను కలిశారు. వీరి మధ్య 40 నిమిషాల పాటు సమావేశం కాగా రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించాలని కోరారు.
అక్కడే ఉన్న ఉక్కు, గనుల శాఖ మంత్రి కుమారస్వామితో చంద్రబాబు సమావేశమయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో అమరావతికి ప్రత్యేక సహాయంగా రూ.15 వేల కోట్లను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న(శుక్రవారం) ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిలీ విమానాశ్రయంలో చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు.