అమరావతి : ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖల పర్వం కొనసాగిస్తున్నారు. టీడీపీ శ్రేణులపై అధికార వైసీపీ నాయకుల దాడులను ఎప్పటికప్పుడూ లేఖల ద్వారా ఆయన పోలీసుల దృష్టికి తీసుకువస్తున్నారు. తాజాగా శనివారం కూడా చంద్రబాబు డీజీపీకి మరోసారి లేఖ రాశారు.
టీడీపీ నాయకుడు పులి చిన్నాకు వైసీపీ రౌడీల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. రాజకీయ భవిష్యత్తుకు ముప్పు వస్తుందనే చిన్నాను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. చిన్నాను చంపేందుకు ఆయన ఇంటి వద్ద నిఘా పెట్టారని ఆరోపించారు. ఎంపీ సురేశ్ ఆదేశాలతో చిన్నాపై 30 కేసులు పెట్టారని ఆయనకు ఏదైన హాని జరిగితే ఎంపీ, ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన మూడో రోజు కొనసాగుతుంది . ఈ సందర్భంగా ఆయన పలు చోట్ల నిర్వహించిన రోడ్ షోలో మాట్లారు. ఎస్సీలకు అండగా ఉండాల్సిన పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. ఎస్సీలపై దాడులకు పాల్పడ్డ వారిపై కనీస చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.