Lakshmi Parvathi | చంద్రబాబు వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎన్టీఆర్ కుటుంబమే అని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని మోసం చేయడమే కాకుండా కుప్పం ప్రజలను గత 35 ఏండ్లుగా మోసం చేస్తున్నారని విమర్శించారు. కుప్పంలో దొంగ ఓట్లతోనే చంద్రబాబు గెలుస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు కూడా వ్యవస్థలను మేనేజ్ చేసి రాబోయే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారని లక్ష్మీపార్వతి గుర్తుచేశారు. ఆ సమయంలో చంద్రగిరి నుంచి టీడీపీ అభ్యర్థి చేతిలో చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోయారని తెలిపారు. 1994 ఎన్నికల్లో తాను, తన భర్త ఎన్టీఆర్ తిరిగామని.. అప్పుడు చంద్రబాబు తమతో కలిసి ఎందుకు రాలేదని నిలదీశారు. పురంధేశ్వరి, భువనేశ్వరి ఈర్శ్య, ద్వేషాలకు తన జీవితం, ఎన్టీఆర్ జీవితం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేశ్‌కు కనీసం మాట్లాడటం కూడా సరిగ్గా రాదని.. అలాంటివాడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడా? అని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు రాష్ట్రానికి చంద్రబాబు చేసిందేమీ లేదని స్పష్టం చేశారు.
అధికార దాహంతో చంద్రబాబు తన మామకు వెన్నుపోటు పొడిచారని లక్ష్మీ పార్వతి అన్నారు. చంద్రబాబును అరెస్టు చేసి నిజాలు కక్కించాలని డిమాండ్ చేశారు. ఒక దొంగను, వెన్నుపోటుదారుడిని కుప్పంలో భరత్ ఓడిస్తారని చాలామంది నమ్ముతున్నారని తెలిపారు. కుప్పంలో చంద్రబాబుపై భరత్ గెలుస్తారని చాలామంది బెట్టింగ్‌లు పెడుతున్నారని అన్నారు. ఈసారి బాబు పప్పులు ఉడకవని లక్ష్మీపార్వతి అన్నారు. ప్రజలు మంచి కసి మీద ఉన్నారని.. కుప్పంలో చంద్రబాబును కప్పను ఆడించినట్టు ఆడిస్తారని విమర్శించారు. టీడీపీలో మేక వన్నె పులిలా ఉన్న బాబు.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడంతో అసలు స్వరూపం బయటపడిందని అన్నారు. సినిమా హీరో పవన్ కల్యాణ్ అని.. రియల్ హీరో వైఎస్ జగన్ అని వ్యాఖ్యానించారు.
రాజధాని పేరుతో అమరావతిలోని రైతుల భూములను చంద్రబాబు కొట్టేశారని ఆరోపించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అయినప్పటికీ 98 శాతం హామీలను అమలు చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని అన్నారు. నిజమైన విజనరీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకుని చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. అన్ని రాష్ట్రాల పథకాలను కలగలిపి, కాపీ మేనిఫెస్టోను ప్రకటించారని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను నెరవేరుస్తామని బీజేపీ నాయకులకే నమ్మకం లేదని అన్నారు. కాగా, సినిమా హీరో పవన్ కల్యాణ్ అని.. రియల్ హీరో వైఎస్ జగన్ అని వ్యాఖ్యానించారు.