అమరావతి : సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని ఉంటుందని వైఎస్ జగన్ ( YS Jagan) చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ( Chandra Babu ) ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. విజయవాడలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ ( NTR Death Anniversary) వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో మూడు రాజధానుల పేరిట కాలయాపన చేస్తూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆరోపించారు. బెంగళూరు, ఇడుపులపాయలో ఉంటే అది రాజధాని అవుతుందా అంట్లూ ప్రశ్నించారు. క్రెడిట్ చోరీ పేరిట చేస్తున్న ఆరోపణలను సైతం తిప్పికొట్టారు. ల్యాండ్, శాండ్, వైన్ వైసీపీ క్రెడిట్, సైబరాబాద్, అమరావతి, కియా, భోగాపురం ఎయిర్పోర్టు కూటమి క్రెడిట్ అని అభివర్ణించారు.
కొంతమంది రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తామంటే సహించబోమని హెచ్చరించారు. తాను కక్ష సాధించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని వెల్లడించారు. నాడు ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సగం వాటా కల్పించారని, చదువుకున్న వారికే ప్రాధాన్యత ఇచ్చేవారని తెలిపారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను సమర్ధంగా అమలు చేశామని వివరించారు.
త్వరలో ఏపీ అంతటా 700 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్ అందరికి ఆదర్శనీయమని తెలిపారు.