అమరావతి : వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా సెల్వమణి ( Roja Selvamani) మరోసారి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ( Chandra Babu) సొంత జిల్లా చిత్తూరు ఉమ్మడి జిల్లాల మామిడి రైతులకు మోసం చేస్తున్నారని ట్విట్టర్లో దుయ్యబట్టారు.
మోసం, కూటమి ప్రభుత్వం రెండూ కవలపిల్లలుగా మారిందని విమర్శించారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని 45 వేల మంది రైతులు పండించిన మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామిడి రైతులకు అండగా ఉండటం కోసం బంగారుపాలెం పర్యటన చేశారని గుర్తు చేశారు.
ఈ పర్యటనకు భయపడ్డ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను తప్పుదోవ పట్టించడానికి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి 45 వేల మంది రైతులు పండించిన 4.50 లక్షల టన్నుల తోతాపురి మామిడిని ప్యాక్టరీలకు తరలించారని అన్నారు. అప్పుడు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ కిలోకు ప్రభుత్వం రూ. 4 , ప్యాక్టరీలు రూ.8 లు మొత్తం కిలో మామిడికి రూ. 12లు ఇస్తామని అంగీకరించారని పేర్కొన్నారు.
నెలలు గడిచినా ప్రభుత్వం ఇవ్వాల్సిన 180 కోట్లు , ప్యాక్టరీలు ఇవ్వాల్సిన 360 కోట్లు విడుదల చేయలేదని ఆరోపిచారు. రైతు సంఘాల ఆందోళనతో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన రూ. 180 కోట్లు విడుదల చేసారని, ప్యాక్టరీలు ఇవ్వాల్సిన రూ. 360 కోట్లు ఇంకా ఇవ్వలేదని తెలిపారు.
తాజాగా ప్రభుత్వం, ప్యాక్టరీ యాజమాన్యం ఇవ్వాల్సిన రూ. 8లు కాకుండా ప్రభుత్వం ఇచ్చినట్లే రూ.4 లే ఇస్తుందని, కొన్ని చోట్ల రూ.3 లే ఇస్తున్నారని కూడా ఆరోపించారు. ప్రభుత్వ మోసం వల్ల 45 వేల మంది రైతులు 180 కోట్లు నష్ట పోవాల్సి వస్తుందని రోజా వెల్లడించారు.