అమరావతి : అదానీ, జగన్ మధ్య కుదిరిన విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో ముడుపుల బాగోతాన్ని తేల్చడంలో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila) ఆరోపించారు.
స్వయంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు అదానీ గ్రూప్స్ రూ.1750 కోట్లు లంచాలు ఇచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ( FBI) రిపోర్టు ఇస్తే కేంద్రంలో మోదీ( Modi) , రాష్ట్రంలో చంద్రబాబు ( Chandra Babu) కనీసం నోరు విప్పడం లేదని ట్విటర్లో విమర్శించారు. అదానీపై చర్యలు తీసుకోవాలని ఏపీసీసీ నిర్వహించిన ఛలో రాజ్ భవన్‌ను పోలీసులు అడ్డుకోవడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
ముడుపులపై విచారణ సైతం జరిపించడం లేదని, అదానీ మీద ఈగ కూడా వాలనివ్వడం లేదని మండిపడ్డారు . అదానీ దేశం పరువు, ఖ్యాతిని ప్రపంచం ముంగిట తీస్తే, లంచాలు తీసుకొని వైసీపీ అధినేత జగన్ రాష్ట్రం పరువు తీశారని ఆరోపించారు. స్వలాభం కోసం విద్యుత్‌ను ఎక్కువ రేటు పెట్టీ కొని జనం నెత్తిన రూ.1.50లక్షల కోట్ల భారం వేశారని అన్నారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందం పెద్ద కుంభకోణం అని తీవ్ర ఆరోపణలు చేసిన తెలుగుదేశం ఇప్పుడు మోదీకి, అదానీకి భయపడి మౌనం పాటిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అదానీపై విచారణకు వెంటనే జేపీసీ ( JPC ) వేయాలని. రాష్ట్రంలో రూ.1750 కోట్ల ముడుపులపై ఏసీబీ ( ACB ) ని రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు.