Chandrababu | ఫేక్ రాజకీయాల ట్రాప్‌లో పడి మోసపోవద్దని వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్‌పై వైసీపీ మండిపడింది. నువ్వు వచ్చాక.. రాష్ట్రంలో ప్రభుత్వం ఫేక్.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఫేక్.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఫేక్.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఫేక్.. రాష్ట్రంలో చట్టం ఫేక్.. చివరకు నీ రాజకీయాలకు ఫేక్ అని ధ్వజమెత్తింది. చివరకు ముఖ్యమంత్రిగా నువ్వే ఫేక్ అని.. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలకు షాడో యజమాని అని విమర్శించింది. నకిలీ గురించి నువ్వు మాట్లాడితే ఎలా చంద్రబాబు అని ప్రశ్నించింది. బాపట్ల జిల్లా భట్టిప్రోలులో ఎస్సై చొక్కాను టీడీపీ నేత పట్టుకున్న వీడియోను ట్వీట్ చేసింది. ఈ వీడియో చూస్తేనే ఎవరు ఫేకో అర్థమవుతుందని సెటైర్ వేసింది.
వాలంటీర్ల వ్యవస్థపై మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు.. ఎన్నికల ముందు మాత్రం కపట హామీలతో వారిని మభ్యపెట్టి.. గెలిచాక నట్టేట ముంచేశాడని వైసీపీ ఆరోపిపంచింది. వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యంపై క్లారిటీ ఇస్తూ.. వాలంటీర్ గ్రూపులన్నీ డిలీట్ చేయాలని అధికారులకు ఆదివారం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొంది. చంద్రబాబు తేనె పూసిన కత్తికి బలైపోయి లక్షలాది మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారని ధ్వజమెత్తింది.
కాగా, గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వంలో విధ్వంసం, బెదిరింపులు చూశామని చెప్పారు. చిన్న తప్పు జరిగితే సరిచేయొచ్చని సూచించారు. కానీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే కష్టపడాలని తెలిపారు. మన నిర్ణయాలకు రాష్ట్ర భవిష్యత్తును మార్చే శక్తి ఉందని అన్నారు. మనమంతా కష్టపడితే 2047 నాటికి మూడో అతిపెద్ద ఎకానమీగా ఇండియా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు.
గత ఐదేళ్లలో ఒక్క కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదని చంద్రబాబు మండిపడ్డారు. ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి కాన్ఫరెన్స్ ఉంటుందని చెప్పారు. తాను కూడా సమయపాలన పాటిస్తానని పేర్కొన్నారు. గంటలు గంటలు ఉపన్యాసాలు ఇవ్వనని చెప్పారు. తన పనితీరుపైనా రివ్యూ ఉంటుందని అన్నారు. ఎవరు పనిచేయకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు.