అమరావతి : వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (YS Jagan) ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్ల పాటు హైదరాబాద్‌తో చంద్రబాబు ( Chandra Babu ) కు సంబంధమే లేదని విమర్శించారు. హైటెక్ సిటీకి ( Hitech City) నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ శంకు స్థాపన చేయగా హైటెక్ సిటీ అభివృద్ధి తన వల్లేనంటూ బీరాలు పలుకుతున్నారని ఆరోపించారు.
తాడేపల్లి నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి పాలన, చంద్రబాబు వ్యవహారశైలీపై విరుచుకుపడ్డారు. 2003-04లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే హైదరాబాద్‌లో నిజమైన అభివృద్ధి మొదలైందని పేర్కొన్నారు. కేసీఆర్ ( KCR ) రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడంతో హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందిందని ప్రశంసించారు.
కానీ చంద్రబాబు నిజాలను ఎప్పుడు అంగీకరించరని తెలిపారు. ఏపీ ఉద్యోగులకు బాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలయ్యాక, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ, ఐఆర్ గురించి, అనేక వాగ్దానాలు చేశారని గుర్తు చేశారు. ఉద్యోగులకు జీపీఎస్ లేదు. ఓపీఎస్ లేదని, ఉద్యోగులను మోసం చేసి వికృత ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. ప్రతినెలా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు రావడం లేదని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఉద్యోగులకు 11 డీఏలు ఇచ్చిన ఘనత తమదేననని అన్నారు. టీడీపీ హయాంలో ఒక్క డీఏ ఇవ్వలేదని అన్నారు.