అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. పచ్చ మీడియా ఎంత చేసినా చంద్రబాబు మరోసారి సీఎం కావడం కల్ల, ఇది రాసి పెట్టుకోండి అని చెప్పారు. జగన్పై ఎల్లో మీడియాలో వ్యతిరేక కథనాలు రాయించి చంద్రబాబును హీరోగా ఎలివేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రూ. 25 కే ఏపీ ప్రభుత్వం ధాన్యం ఎగుమతి చేస్తున్నదని చంద్రబాబు తోక పత్రికలో రాశారని, రైతుల శ్రమను దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారని చెప్పారు. ఇవన్నీ చంద్రబాబును సీఎంగా చేయడానికే అని దుయ్యబట్టారు.
జగన్పై ఎల్లో మీడియా తమ దుష్ప్రచారాన్ని ఆపాలని మంత్రి కొడాలి నాని సూచించారు. జగన్పై చంద్రబాబు అనుకూల మీడియా ఏడుస్తుందని, చంద్రబాబు ఈ జన్మలో మరోసారి ముఖ్యమంత్రి కాలేరని వ్యంగ్యంగా అన్నారు. ఎల్లో మీడియా ఎన్ని ఫీట్లు చేసినా వారి ప్రచారాన్ని ప్రజలు నమ్మరన్నారు. చంద్రబాబును సీఎం చేసేవరకు ఆయన తోక పత్రికలు ఇలాంటి రాతలు రాస్తూనే ఉంటాయని, వాటికి నిద్ర కూడా పట్టదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ తరహాలో జగన్ కూడా చరిత్రలో నిలిచే పనులు చేస్తున్నారని కొనియాడారు.
కాకినాడ పోర్టు నుంచి వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న బియ్యంలో అవినీతి జరుగుతుందని ఆరోపిస్తున్నాయని కొడాలి నాని చెప్పారు. బియ్యం ఎగుమతులకు సంబంధించిన వివరాలన్నీ ఆన్ లైన్ ఉంటాయన్నారు. కాకినాడ పోర్టు నుంచి ఏపీ నుంచే కాకుండా బిహార్, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా ధాన్యం ఎగుమతి అవుతున్న విషయాన్ని గమనించాలని కొడాలి నాని సూచించారు. పేదల కోసం పనిచేసే సీఎంపై ఇన్ని అబద్ధాలు ప్రచారం చేయడం దారుణమన్నారు. గౌతమ్ సవాంగ్ బదిలీపై స్పందిస్తూ.. ఆయన డీజీపీగా వచ్చి చాలా కాలమైందని, వేరే వారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం డీజీపీని మార్చిందని వివరణ ఇచ్చారు.